Monday, 18 June 2012

ఇష్టంలో అయిష్టం

అన్యా పోస్ట్ చదివొచ్చావా తాగినోడిలా మాట్లాడుతున్నావ్ ఆ టైటిలేంటీ? ఇష్టంలో అయిష్టం ఏంటీ సాంబార్‌లో టీపొడిలాగా అంటారా...కికికి ఏమో నాకు తెలీదు మరి.

నాకు కొన్ని విషయాలు ఇష్టమేగానీ చేసేటప్పుడు ఎందుకో అయిష్టం.

అ) చేతికి కుంకుమౌతుందని స్వతహాగా నేను బొట్టు పెట్టుకోను. గుళ్ళో పూజారినో లేదా పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారిని పెట్టమని చెబుతా...ఈ రెండూ కుదరనప్పుడు అలానే గుళ్ళోనుంచి బొట్టులేకుండానే బయటికి వచ్చేస్తా... చాలాసార్లు స్వతహాగా పెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాను కానీ ఎందుకో మనసు ఎదురుతిరిగి అస్సలు మాట వినదు. మనస్పూర్తిగా చేయని పని చేయడం ఎందుకని లైట్ తీస్కుంటుంటాను. నిజానికి మన ఆంధ్రాలో కన్నా తమిళనాడులోని పూజారులు చక్కగా బొట్టు పెట్టేవారు. రెండు వేళ్ళతో తెల్లబొట్టు ఒకటి పెట్టి, దానిపైన కుంకుమ పెట్టి దీవించేవారు. అఫ్‌కోర్స్, కుంకుమొక్కటే కాదు, చేతికి పౌడరయ్యి చిరాగ్గా ఉంటోందని మొహానికి పౌడర్ రాస్కోవడం కూడా పది, పదిహేనేళ్ళ క్రితమే బ్యాన్ చేశా. చిన్నప్పుడంటే అమ్మ మొహానికి పౌడర్ రాసి తలదువ్వి చక్కగా స్కూల్‌కు ముస్తాబు చేసేది కాబట్టి ఓకే.  అదే ఇప్పుడైతే సెలూన్‌లో మంగలి పూస్తే సరి లేకపోతే ఆ మొహం అంతే. :-)

ఆ) సాష్టాంగ నమస్కారం. అందరూ దేవుని ఎదుట నీవే దిక్కు అని సాష్టాంగపడి నమస్కరిస్తుంటారు. కానీ, ఇక్కడ కూడా అంతే. నా మనస్సు నో నో అని చెప్పి దూరంగా లాక్కెళ్ళిపోతుంది. ఆ మాటకొస్తే, నిజానికి ఈ మధ్య కొంచెం తిన్నగా దేవునికి రెండు చేతులూ జోడించి నమస్కారం పెడుతున్నాను కానీ, అదే అంతకుముందైతే రజనీ స్టైల్‌ను బాలయ్య ఇమిటేట్ చేసినట్టుగా చండాలంగా ఉండేది నా నమస్కారం.

ఇ) పెద్దల కాళ్ళకు నమస్కరించడం. అందరూ ఎంతో చక్కగా పెద్దల కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదాలు తీస్కుంటుంటారు. దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయడానికే గోల చేసే మనస్సు ఇక్కడ మాత్రం ఊర్కనే ఎందుకుంటుందీ, ఇంకాసేపు ఇక్కడే ఉంటే బలవంతంగా నిన్ను తోసేస్తార్రోయ్ అంటూ బరా బరా దూరంగా జనావసం లేని ప్రాంతంలోకి లాక్కెళ్ళిపోతుంది.

నిజానికి పైవన్నిటికీ నేను వ్యతిరేకం కాదు. చేయడానికి అన్నీ ఇష్టమే. ఎందుకో తెలీదు మనసు మాత్రం అయిష్టం అంటుంది. అవసరాన్ని వీలును బట్టి హోమాలు, వ్రతాలు గట్రా చేయిస్తుంటాను. ఇక్కడ కూడా వాటిల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఒప్పుకోదు మనస్సు. దూరంగా ఎవరైనా నా పేరు చెప్పి చేస్తే ఓకే... అందుకే, గుడికెళ్తే వీటిల్లో ఏదో ఒకటి చేయాల్సివస్తుందని వెళ్ళడానికి ఇష్టపడను. పేరెంట్స్, ఫ్రెండ్స్ లాక్కెళ్ళినప్పుడు వెళ్ళినవే ఎక్కువ. :-)

ఇంతకీ మీకు కూడా ఇలాంటి "ఇష్టంలో అయిష్టాలు" ఏవైనా ఉన్నాయా?

Saturday, 9 June 2012

పరిష్కారమేంటీ?.........

ఇట్టాంటి సమస్యలు రియల్ లైఫ్‌లో చూశాను. వాటిని చాలావరకు పెద్దలే పరిష్కరించారు. కానీ ఈ సమస్యలో ఆమెకు తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడమే మైనస్. నేను చూసినవాటిల్లో తల్లిదండ్రులే కూతుర్ని దగ్గరికి తీస్కొని మా అమ్మాయిని కాపురానికి పంపం అని తెగేసి చెప్పి అబ్బాయి తల్లిదండ్రులని దిగొచ్చేలా చేశారు (అమ్మాయిదే తప్పు అయినప్పటికీ). సీన్ ఇంతదూరం వచ్చాక పరువు ప్రతిష్టలు అంటూ వేళ్ళాడకూడదు. బజార్న ఈడ్చి పెద్దల పంచాయితీ పెట్టించాలి. అవతలి అమ్మాయిని కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఆమె తల్లిదండ్రుల ముందర వాళ్ళ ఊళ్ళోనే నలుగురు చూస్తుండగా జుట్టు పట్టుకొని ఈడ్చి పరువు తియ్యాలి. సింపుల్‌గా రచ్చ రచ్చ చెయ్యాలన్నమాట. అప్పుడే వాళ్ళతో పాటు భయంతో ఇతరులు కూడా దారిలోకొస్తారు అంతేకానీ కనికరం చూపించు అంటూ బ్రతిమాలుతూ ఇలా పేపర్లలో ఇస్టోరీలు రాసుకుంటే వస్తుందా? :-))

Friday, 8 June 2012

తిరుమల గురించి కొన్ని నిజాలు....

 1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. 


2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి  జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు. 
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ. 


4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. 

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి. 

6.  గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు. 


7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.  

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు. 

11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు. 

Thursday, 7 June 2012

అమ్మాయిల హాస్టల్ - పార్ట్ 1

2006 వ సంవత్సరం. భాగ్యనగరం, అమీర్ పేట.
స్థలం: ఆర్ ఎస్ బ్రదర్స్ దగ్గర నుండి మైత్రీవనం దాకా ఉన్న చుట్టుపక్కల ఏరియా.

జెంట్స్ హాస్టల్ నెలకు Rs. 2500/-
లేడీస్ హాస్టల్ నెలకు Rs. 1750/-

అని రాసి ఉన్న ప్రకటన చూసి ఆగిపోయా. ఏమిటీ వివక్ష జెంట్స్‌కేమో ఒకరేటు, ఆడలేడీస్‌కు ఇంకో రేటా? నెలకు Rs. 2500/- రూపాయలు కడుతుంటేనే పిచుక గూళ్ళలాంటి క్యాబిన్లలో అరంగుళం గ్యాప్ కూడా లేకుండా వరుసగా పరుపులేసి కుక్కేస్తున్నారు అటువంటిది కేవలం Rs. 1750/- లు కొండకచో కొన్నిచోట్ల కేవలం రూ. 1500/- రూపాయలే తీసుకుంటున్న హాస్టల్లలో ఆడలేడీస్‌కు సౌకర్యాలు ఇంకెంత అధ్వాన్నంగా ఉండాలి అనిపించింది. జెంట్స్‌కన్నా దాదాపు వెయ్యి రూపాయలు తక్కువగా వసూలు చేస్తున్నప్పటికీ జెంట్స్ హాస్టల్స్ కన్నా చుట్టుపక్కల ఆడలేడీస్ హాస్టల్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంత తేడా ఉన్నప్పటికీ హాస్టల్ నిర్వాహకులు ఆడలేడీస్ హాస్టల్లకే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకిస్తున్నారు? ఎవరి వల్ల ఎక్కువ లాభం వస్తుంది? వాళ్ళు తిండి అంత తక్కువ తింటారా? ఎంత తక్కువ తింటే మాత్రం మరీ ఇంత భారీ తేడానా? లాభం లేదు. ఈ ఘోరకళిని నేను చూడలేను. విప్లవ శంఖం పూరించాలి. అన్నగారు పుట్టిన ఈ ఆంధ్రదేశంలో సాటి మగాడికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తూ కూడా ఊర్కునేదిలేదు. పిడికిలి బిగించాల్సిందే, ఈ వివక్షను అణగదొక్కాల్సిందే అనుకుంటూ ఆవేశంతో రూమ్‌కు వెళ్ళిపోయాను.

నలుగురి ఫ్రెండ్స్‌కు కూడా ఆవేశంగా విషయం చెప్పేసి నా ఆవేశాన్ని వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ చేశాను. అందరం కూడా ముక్త కంఠంతో మనం ఇంకాసేపట్లో లేడీస్ హాస్టల్ చూడ్డానికి వెళ్తున్నాం అని బయలుదేరాం.

స్థలం: అమీర్ పేటలోని ఒక లేడీస్ హాస్టల్.

హాస్టల్ యజమానురాలు: ఏం కావాలి బాబు
నలుగురిలో ఒకడు: హాస్టల్
హా.య: ఇది లేడీస్ హాస్టల్ బాబు. జెంట్స్ కివ్వం
న.ఒ: ఎల్లుండి మా చెల్లి కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి ఇక్కడికొస్తుందండీ. అందుకోసం ఈ ఏరియాలో తన కోసం మంచి హాస్టల్ వెతుకుతున్నాం. అందుకే ఓసారి మీ హాస్టల్ చూద్దామని వచ్చాం.
హా.య: ఓహ్...అలాగా.. అయితే నెలకు Rs. 1750/- కట్టాలి బాబు.
న.ఒ: నచ్చితే నెలకు కాకపోతే పదినెల్లకు ఒకేసారి కడతాం. కాకపోతే మీ హాస్టల్ ఒకసారి చూడాలి. చూడ్డానికి బాగుండి సౌకర్యవంతంగా ఉన్నట్టనిపిస్తేనే మా చెల్లిని జాయిన్ చేస్తాం.
హా.య: జెంట్స్‌ను అలౌ చెయ్యడానికి కుదర్దు బాబు.
న.ఒ: మరి బాగుందో లేదో ఎలా తెలుస్తుందండీ? రేప్పొద్దున జాయిన్ చేసిన తర్వాత మా బంగారు చెల్లికి, ముద్దుల చెల్లికి, చిట్టి చెల్లికి ఏ చిన్నకష్టమొచ్చినా మేము తట్టుకోలేం. హా (ఆయాస పడిపోతూ ఎదవ యాక్టింగ్)
హా.య: మీ నలుగురికీ కలిపి ఒకత్తే చెల్లి ఉందా?
అందరూ: అవునండీ అవును. అందుకేగా నలుగురమూ వచ్చాం.
హా.య: ఇదంతా ఎందుకుకానీ జెంట్స్‌ను లోపలికి అనుమతించడం కుదర్దుబాబు. ఆలోచించుకోండి.
న.ఒ: ఆలోచించుకునేదేమీలేదు. మీరు మాకు హాస్టల్ చూపించి నచ్చితేనే మా చెల్లిని ఇక్కడ చేర్పిస్తాం లేకపోతే వేరే హాస్టల్ వెతుక్కుంటాం ఖరాఖండిగా చెప్పేసి అందరం ఒక్కసారిగా వెనుదిరిగాం. 
వచ్చిన బేరం పోగొట్టుకోవడం ఎందుకని ఆగండి బాబు అంటూ పిలిచింది హాస్టల్ యజమానురాలు.
ఐడియా పారినట్టుందని మురిసిపోతూ అందరం మళ్ళీ హాస్టల్ వైపు తిరిగాం.

లోపలికెళ్ళి అమ్మాయిలకు చెప్పి వస్తాను మీరు హాస్టల్ చూడ్డానికి వస్తున్నారు కాసేపు వాళ్ళని ఏమనుకోవద్దని ఓ రెండు నిమిషాలాగండి అంటూ లోపలికి వెళ్ళింది.

రెండు నిమిషాల తర్వాత లోపలికెళ్ళాం.

అటాచ్డ్ బాత్ ఉన్న ఒక్కొక్క రూమ్‌లో మూడు మంచాలేసి ఉన్నాయి. అవి కూడా ఒకరికొకరికి ఇబ్బంది లేకుండా కాస్త దూర దూరంగా ఒక్కో గోడకు ఒక్కో మంచం. చదువుకోవడానికి, రాసుకోవడానికి వీలుగా కుర్చీలు బల్లలు.  చూడగానే కళ్ళలో నీళ్ళు, కోపం, బాధ, కసి, అసూయ, ఈర్ష్య అన్ని రకాల భావాలూ కలిగాయి.  దీనెమ్మ జీవితం మాకేమో పిచుక గూళ్ళూ, వీళ్ళకేమో ఇలా విశాలంగా. మాకేమో ఎక్కువ డబ్బులు, వీళ్ళకేమో తక్కువ డబ్బులు. అసలు ఇలాంటి హాస్టల్ ఒక్కటి దొరికినా కూడా నేను అనవసరంగా రూమ్ అద్దెకు తీస్కొని డబ్బులు వేస్ట్ చేసుకునేవాణ్ణి కాదు కదా అని బాధ కలిగింది కాసేపు. దేవుడా! ఈ వివక్షకు అడ్డుకట్ట పడేదెప్పుడు. ఏ మహానుభావుడొస్తాడనుకుంటూ "వస్తామండీ! అడ్వాన్స్ ఏమైనా కట్టమంటారా, లేకపోతే ఎల్లుండి మా చెల్లి వచ్చినప్పుడు మొత్తం ఒకేసారి కట్టి జాయిన్ చెయ్యమంటారా" అంటూ వాళ్ళ రిప్లై కోసం చూడకుండా బయటికి నడిచాం.

ఏంట్రా ఇది, వాళ్ళ హాస్టలేంట్రా అలా ఉంది. మన హాస్టల్ ఇలా చెండాలంగా ఉందేంట్రా. పైగా డబ్బులు కూడా తక్కువ. పోనీ అమ్మాయిలు తిండి మరీ అంత తక్కువ తింటారా?
ఏం తక్కువ తినడం రా బాబు. దొరికిందే ఛాన్స్ అని నా గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్లో కుంభాలు కుంభాలు మేస్తుంది.
అలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ అసలు కారణం ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచించుకుంటూ ఇంటికెళ్ళిపోయాం.


హైదరాబాదులో ఎక్కడ చూసినా ఇప్పటికీ ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. కారణమేంటో నేటికీ తెలియరాలేదు.



Tuesday, 5 June 2012

చెట్లెక్కడ నాటాలి?

పర్యావరణ దినోత్సవం రాగానే అందరూ చెట్లు నాటాలీ చెట్లు నాటాలీ అనేటోళ్ళే. ఇంతకీ ఎక్కడ నాటాలి చెట్లు. ఉండేదే కాస్తంత కొంప. ఆ కొంపలో సరిగ్గా సామాన్లు పెట్టుకోవడానికే జాగా సరిపోదు. ఇంక చెట్లెక్కడ నాటేదీ. పోనీ చెట్లు నాటాము అనుకుందాం. మొక్కలు నాటుతారు కానీ చెట్లు నాటేదేంట్రా ఎదవ అంటారా? తూచ్..అది ఓల్డ్ కుళ్ళు జోకు. ఇప్పుడు చెట్లు కూడా నాటొచ్చు. పోనీ కాసేపు చెట్లో/మొక్కలో ఏదోకటి అనుకుందాం.

అసలే రియలెస్టేట్ బూమ్ భూతంలా భారీగా ఉన్న ఈ రోజుల్లో ఇంటిముందు ఓ పేద్ద చెట్టు ఉంటే ఎంత నష్టం. అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటే అంత మేర మనం స్థలం నష్టపోవాలి. పైగా వాటివేర్లు మన ఇంటి క్రింది భాగంలోకి చొచ్చుకొని రావడం వలన ఇల్లు కూలిపోయే ఛాన్స్ కూడా ఉంది. పేద్దగా ఈదురు గాలులు వచ్చినప్పుడు అది ఎక్కడ విరిగి మన ఇంటి మీద పడుతుందోనని భయంతో చావాలి. రాలిపడిన ఆకుల్ని ప్రతిరోజూ ఎవడు శుభ్రం చేస్తాడు మీ బాబు చేస్తాడా అంటూ రిమోట్ గారు అప్పడాల కర్రతో వస్తారు. చెట్టు మీద పిట్టలన్నీ చేరి ఇంటి ముందర రెట్టలేస్తుంటే ఆ వాసన ఎవడు భరిస్తాడు. కొండకచో తెల్లచొక్కా వేసుకొని బయటికెళ్తున్నప్పుడు మన చొక్కాల మీద కూడా రెట్టవేసే ఛాన్స్ ఉంది. ప్రొద్దున్నే హాయిగా ఎనిమిదిగంటలదాకా నిద్రపోదామనుకుంటే తెల్లారి ఐదునుంచే చెట్టుమీది కాకుల గోల. అందుకే చెట్టు పక్కింటోడి స్థలంలో ఉండాలి నీడ మాత్రం మన ఇంట్లో ఉండాలి.

ఎహే...ఆ మాత్రం చెట్టు నాటడానికి స్థలానికి గతిలేనోడివి ఇంటి ముందర చిన్న చిన్న పూల  మొక్కలు నాటుకోవోయ్.

పూల మొక్కలు నాటితే పాములొస్తాయ్, పశువులొచ్చి మేస్తాయ్, పక్కింటి పిల్లలొచ్చి పూలన్నీ కోసుకుపోతారు.మొక్క నాటి, నీళ్ళు పోసి ఎవరికో దానం చెయ్యడం నాకిష్టముండదు. అందుకే నేను నాట.

ఒక కుండీ కొనుక్కొని అందులో ఓ తులసి మొక్క నాటుకోరా బాబు. నువ్వూ నీ ఎదవ గోల విన్లేక ఛస్తున్నాం.

అదైతే ఓకే. ప్రస్తుతానికి అదే చేస్తున్నా. :-)

ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య...

బడి వేళల్లోమార్పులు...హుమ్మ్... ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగున్నర వరకు.

నాకు గుర్తున్నంతవరకు నా చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేది. తర్వాత మార్చారనుకుంటా. అప్పట్లో ఇంటెర్వెల్ వచ్చినా సరే నాలుగైదు ఓవర్లు క్రికెట్ ఆడేవాళ్ళం. మధ్యాహ్నం అన్నం తిన్నాక బోల్డంత టైమ్, ఆ టైమ్‌లో ఫైటింగాట ఆడుకునేవాళ్ళం.

ప్చ్.. పాపం ఇప్పటి వాళ్ళకు అటువంటి ఛాన్సుల్లేవు.

మొన్న ఇంటికెళ్ళినప్పుడు అడిగాను. బడివేళల్లో మార్పులంటున్నారు ముందు బెస్టా ఇప్పుడు బెస్టా అని.

బడివేళలు ఎట్టా ఉన్నాగానీ ఈ మధ్య మేం ఎక్కువ సేపు పిల్లల్ని బయట ఆడుకోనివ్వట్లేదు బాబు.

ఏం? ఎందుకని?

ఆడపిల్లలు చెడిపోతున్నారు సార్. ఎక్కువ సేపు బయటికి వదిలిపెడితే ప్రేమని, దోమని, అదని, ఇదనీ... అందుకే అందర్నీ కాంపౌండ్ దాటనీకుండా మా కళ్ళముందే కాసేపు ఏ ఆటలు ఆడుకుంటారో ఆడుకోండని కాపల కాస్తున్నాం. 

హుమ్మ్...వాళ్ళు చెప్పిందీ నిజమే పాపం. ఎనిమిదో తరగతిలోనే ప్రేమనీ, దోమనీ చెట్లవెంటా, పుట్టల వెంటా తిరిగి ఆ విషయం బయట పడ్డాక పెద్దలు మందలిస్తే ఆవేశంలో ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అంతకు ముందు జరిగాయి. పైగా పల్లెటూరు కాబట్టి ఏ తప్పు జరిగినా అయ్యవార్ల మీదకే వస్తుంది. ఎవరి భయం వాళ్ళది.

నా చిన్నప్పుడు కూడా ఆరో తరగతి నుంచే లవ్ లెటర్లూ గట్రా మార్పిడి జరిగేది కానీ అది అప్పట్లో ఎవ్వరి మీదా పెద్దగా ప్రభావం చూపేది కాదు. పైగా క్లాస్ రూమ్ వరకే పరిమితమయ్యేది.

ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లూ, కంప్యూటర్లు, ఐపాడ్లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ సాధనాలు వచ్చిచేరాయి. ఎస్సెమ్మెస్సులూ, మిస్సుడు కాల్సూ, గంటల తరబడి ఫోన్లో సొల్లు, మళ్ళీ ఫోన్లో ఇంటర్నెట్టూ ఒకటా రెండా. ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య అయ్యి కూర్చుంది.

Monday, 4 June 2012

ద...ద...ద...ద...ద...దరువు...

మధ్నాహ్నం ఒకటిన్నర. ఏమి చెయ్యాలి. ఈ ఎండలో పడి బస్సులో ప్రయాణమా లేదా హాయిగా సినిమా చూసి సాయంత్రం చల్లగాలిలో ప్రయాణమా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఏదో ఒక సినిమానే చూసి పోదాం అని దగ్గర్లో ఉన్న థియేటర్ వైపు అడుగులేశాను. అధినాయకుడు, దరువు రెండు సినిమాలాడ్తున్నాయి అక్కడ. రివ్యూల్లో రెండూ రాడ్డు సినిమాలే అని చదివాను. మరి రెండు రాడ్డు సినిమాల్లోనూ ఏ రాడ్డైతే బెటర్ అని కాసేపు ఆలోచించి చివరికి "రెండు సినిమాల్లోనూ ఏ సినిమాకైతే ఎక్కువమంది జనాలెల్తారో దానికెళ్దాం" అని ఫిక్సై పోయి రెండు కౌంటర్లకేసి గమనిస్తూ అలా సైడ్‌కు నిలబడ్డా.

దరువు సినిమా టికెట్ కౌంటర్ రెండు బారల పొడవుంది. అధినాయకుడు దగ్గర అరడజను మంది కూడా లేరు. మరి కాసేపు చూద్దాం అని ఆగా. కాసేపటికి దరువు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్ని కౌంటర్లు కూడా డబుల్ అయ్యాయి. అధినాయకుడు దగ్గర ఉన్న అరడజన్లో హాఫ్ డజన్ కనిపించడం లేదు. ఇలానే ఉంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించి నా నిర్ణయానికి కట్టుబడి దరువు సినిమాకు క్యూలో నిలబడ్డా. కాసేపటికి నా వెనకమాల లైన్ మళ్ళీ రెండు బారలయ్యింది. అధినాయకుడు మాత్రం పెరగలేదు తగ్గలేదు పాపం.

దరువు కౌంటర్ ముందర చూస్తే మహా అయితే ముప్పై మంది ఉంటారేమో, వెనకాల మంచి సీటే వస్తుందని ఆశపడ్డా. ప్చ్... తరువాత తెలిసింది ముందున్న ఒక్కొక్కరు ఐదు నుంచి పది టికెట్లు తీసుకుంటున్నారని. నా వంతు వచ్చేటప్పటికి ఇద్దరు తగిలారు. అన్నా నాకొకటి, నాకో ఐదు అని మొత్తం ఆరు టికెట్లు. ఇంతవరకు క్యూలో నిలబడింది మీకోసమేనా దొబ్బెయ్ బే అని ఐదు టికెట్లోన్ని వదిలేసి, ఒక్క టికెట్ వాడికి ఒక్కటి తీసి ఇచ్చా ఎందుకైనా మంచిదని. భయపడినట్టుగానే నా సీట్ H వరసలో మూలనొచ్చింది. హుమ్మ్...

లోపలి కెళ్ళి కాసేపు కూర్చున్నాక చూస్తే హాల్ మొత్తం నిండిపోయింది. ఇదేంటండీ ఈ సిన్మా చూస్తేనేమో రాడ్ అంటున్నారు, పైగా వచ్చి రెండు వారాలయ్యింది, ఇవ్వాళేమో శనివారమో, ఆదివారమో, కనీసం సెలవు దినం కూడా కాదు. సోమవారం నాడు అదీ ఈ సినిమాకు ఫుల్ అవడమేంటండీ అని ఆశ్చర్యంగా నేను టికెట్ తీసిచ్చినోడిని అడిగా...

ఈ సిన్మాకు ఇది నేను రెండోసారి అన్నా రావడం... వాడి జవాబు.
సినిమా అంత బాగుందా...
కామెడీ బాగుందన్నా...
ఏదీ నిజం చెప్పు.
అంటే బయట ఎండ, ఉండలేక ఇక్కడైతే ఏసీ ఉంటుందని వచ్చా...
ఇదీ అబద్ధం. ఏదీ ఈ సారి నిజం చెప్పు చూద్దాం.
ఇప్పుడు కరెంట్ పోతుందన్నా. అటు పనిలేక, ఇటు ఉక్కపోతకి చావాలి. బయట రోడ్లెమ్మట తిరిగే బదులు ఇదైతే బెటర్ అని వచ్చా.
హుమ్మ్...అద్దీ మ్యాటర్. ఈ సిన్మా ఎందుకు హౌస్‌ఫుల్ అయ్యిందో అప్పుడర్థమైంది నాకు. అలా మాటల్లో ఉండగా సిన్మా మొదలు కాబోతుందనగా కరెంట్ పోయింది. థియేటర్ వాడు జెనరేటర్ ఆన్ చేశాడు. ప్చ్... ఏసీ తీసివేశాడు. డొక్కు ఫ్యాన్లేశాడు ఉక్కపోతకు చావండని.

సిన్మా మొదలైంది.

స్క్రీన్ మీద అక్షరాలతో తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నిర్మాతలు అన్నచోట చూస్తే అందరూ కూడా యమగోల, యముడికి మొగుడు, యమలీల సినిమాల నిర్మాతలు అని బ్రాకెట్లో రాశాడు. యముడు వాళ్ళకు బాగా అచ్చొచ్చినట్టున్నాడు పాపం.

తర్వాత, శవాల దగ్గర వాయించే డప్పుల సంగీతం బ్యాగ్రౌండ్లో వినిపిస్తుండగా "ద..రు..వు" అని ఒక్కో అక్షరం టైటిల్లాగా స్క్రీన్ మీద పడింది.

యమలోకం. యమపురి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యమలోకం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతున్నది. ఎప్పుడో పెద్దాయన ఎన్టీయార్ యమగోల సినిమాలో నటించి యమలోకంలో గోల గోల చేశారు. కాకపోతే యముడి మీద హాస్యం ఏమిటనో, గౌరవం తగ్గకూడదనో లేదా విమర్శలు రాకూడదన్న కారణం చేతనో ఆ సినిమాలోని నరకలోక సన్నివేశాలను ఆయన కలకంటున్నట్టుగా చిత్రీకరించారంట. ఎందుకంటే కలలకు లాజిక్కులు, రీజనింగులు ఉండనవసరం లేదు కాబట్టి. తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి నటించిన "యముడికి మొగుడు" సిన్మా నుంచే యముడి మీద వెకిలి హాస్యం చిత్రీకరించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్నుంచి ఇప్పటి దరువు సిన్మా వరకు వివిధ రూపాలను సంతరించుకుంటూ అది సాగుతూనే ఉంది. మిగతా దేవుళ్ల మీద తీస్తే సిన్మా హిట్టవుద్దో ఫట్టవుద్దో తెలీదు కానీ యముని మీద తీసినవి మాత్రం హిట్టే అయ్యాయి. ఆ మధ్య వచ్చిన "స్వర్గలోకం టు నరకలోకం వయా భూలోకం" పోద్దేమోననుకున్నాను కానీ ఆ సిన్మా నిర్మాతలు తమకు మంచి లాభాలొచ్చాయని చెప్పడంతో యమునికి తిరుగులేదని ఫిక్సైపోయాను.

దరువు కూడా పైన చెప్పుకున్న సినిమాల్లాంటి సినిమానే. భూలోకంలోని ఒక తెలుగు వాడు యముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలి, దాన్ని అడ్డం పెట్టుకొని హీరో లోకకళ్యాణానికి పాటు పడాలి. అదీ పాయింట్. సరే సినిమా విషయానికొద్దాం.

యమలోకంలో కాసేపు యముడు, చిత్రగుప్తుడు తదితర పాత్రల మధ్య వెకిలి హాస్యం అయిపోయాక చిత్రగుప్తుడు యముడి పీఠం క్రింద మంట పెట్టాలనుకోవడంతో కథ భూలోకంలోకి వస్తుంది. వెంటనే సచిన్ సెంచరీల రికార్డును సమం చేస్తూ చెన్నైలో జైల్లో నుంచి బయటికొస్తాడు బుల్లెట్ రాజా... మరి కాసేపటికే శవాల దగ్గర వేసే డ్యాన్సులతో, డప్పులతో, మెరీనా బీచ్ తీరంలో చెన్నై చేపల బ్యాచ్‌తో తమిళ ఘాటుతో కూడిన మాస్ మహారాజా మాస్ సాంగ్. ఇంకాస్సేపటికి తిక్కల్ది అయిన హీరోయిన్‌తో లవ్. ఈ సిన్మాలో హీరోయిన్ నిజంగా తింగరి, తిక్కదాన్లాగే ఉంటుంది మరి. చలాకీతనం ఉండదు, షాక్ అయితే నోరు తెర్చుకొని చూస్తూ నోట్లోకి ఈగలు పోయినా పట్టించుకోదు. హీరోతో సులభంగా లవ్‌లో పడిపోద్ది, వాడి వెంట పరిగెడుతుంది. ఫైటింగ్‍లో కూడా దాంతో రొమాన్స్ చేస్తూ హీరో ఛస్తాడు. యథావిధిగా మనోడు యమలోకానికి వెళ్ళి, భూలోకానికి తిరిగొస్తాడు. కాకపోతే వీడి బాడి కాలిపోద్ది కాబట్టి వాడిలాగే ఉన్న ఇంకోడి బాడిలోకి పరకాయ ప్రవేశం చేసి వస్తాడు.

ఆ తర్వాత యథావిధిగా తమిళ సినిమాల్లోలాగా రవితేజ చేసే ఓవరాక్షన్, వెకిలి చేష్టలూ భరిస్తే సినిమా క్లైమాక్స్‌కు చేరి బుర్ర మీద దరువేసుకుంటూ మనం లేచెళ్ళిపోతాం.

ఇంక చివరిగా సినిమా నచ్చిందా అంటే నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే తెలుగు సినిమా కాబట్టి. వాళ్ళు తియ్యడానికి మనం చూడ్డానికీ అలవాటు పడ్డాం కాబట్టి.



Sunday, 3 June 2012

ఏడుకొండల సామీ.........

ఒకానొకప్పుడు తిరుమలకు ఎవరైనా వెళ్ళొస్తే "తిరుమలకు వెళ్ళొచ్చావా!" అని ఆశ్చర్యంగా అదో అచీవ్‌మెంట్ లాగా అడిగేవారు. వెళ్ళొచ్చినవాళ్లు కూడా వాళ్ళ సందులోవాళ్ళని నలుగురినీ పిలిచి భోజనాలు పెట్టి తిరుమల ప్రసాదం లడ్డూని పంచి పెట్టేవారు. ప్రసాదంతో పాటు చేతికో, మెడకో కట్టుకోవడానికి నల్ల దారం కూడా ఇవ్వాల్సిందే. నా చిన్నప్పుడు ఇప్పట్లాగా తిరుమలలో ఇన్ని సౌకర్యాలు లేవు. ఇంటిదగ్గర్నుండే వంట సరంజామానంతా తీసుకెళ్ళాలి. రైల్వేస్టేషన్ నుండి అలిపిరి అక్కడనుండి కొండపైకి మొత్తం అంతా నడిచేవెళ్ళేవారు. అదీ ఒట్టిచేతుల్తోకాదు. భుజం మీద యాభై కేజీల బియ్యం బస్తాతో నడిచేవాళ్ళు ఒకరైతే, ఇతరత్రా బ్యాగులు వంట పాత్రలు వగైరా కొద్ది కొద్ది దూరం నడుస్తూ మార్చుకుంటూ కష్టపడి తిరుమల చేరుకునేవారు. ఇప్పుడు చేతిలో వాటర్ బాటిల్ మొయ్యాలన్నా కష్టమే. అప్పట్లో ఇంటికి త్వరగా తిరిగివెళ్ళాలన్న ఆలోచన ఉండేది కాదు. వారం పది రోజులు పైనే ఉండేవారు.

ఇప్పుడు భక్తుల కోసం తిరుపతి, తిరుమలలో బోల్డన్ని సౌకర్యాలు. తిరుపతిలో రైల్వేస్టేషన్ దిగితే చాలు మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు. గత సంవత్సరం వరకు బస్టాండ్‌కు సమీపంలో ఉన్న "శ్రీనివాసం"లో లాకర్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కొన్ని నెలల క్రితమే రైల్వేస్టేషన్ ఎదురుగా "విష్ణు నివాసం" కట్టారు. కొత్తగా కట్టారు కాబట్టి, నీట్‌గా, చాలా సౌకర్యవంతంగా ఉంది. ప్రయాణ ఖర్చులని మినహాయిస్తే, మిగతా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే యాత్ర తిరుమల ఒక్కటే. అందుకే చాలామంది ప్రతీ రెణ్ణెళ్ళకో, మూణ్ణెళ్లకో వీలైన ప్రతీసారీ వస్తుంటారు. రెండేళ్ళ క్రితం నేనూ దాదాపు ప్రతీ నెలా వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతీసారీ నడుచుకుంటూ వెళ్ళడమే.

చెప్పానుగా తిరుపతిలో ట్రైన్ దిగితే చాలు మిగతా అంతా దేవుడే చూసుకుంటాడని. ప్రతీ పది, పదిహేను నిమిషాలకు దేవస్థానం బస్సులు రైల్వేస్టేషన్ నుండి అలిపిరికి తిరుగుతుంటాయి. కాబట్టి రైల్వేస్టేషన్ నుండి ఫ్రీగా అలిపిరి చేరుకోవచ్చు. అలిపిరి నుండి నడిచేవారి స్పీడ్‌ని బట్టి మూడు గంటల నుండి ఆరుగంటల టైమ్ పడుతుంది తిరుమల చేరుకోవడానికి. మెట్ల దారిలో ప్రతీ మెట్టుకూ బొట్టు లేదా కర్పూరం వెలిగిస్తూ వెళ్ళేవారుంటారు. వాళ్ళకి ఎంత టైమ్ పడుతుందో. ప్రతీ మెట్టునూ పూజిస్తుంటారు కాబట్టి మెట్ల మీద చెప్పులతో తిరగడం మంచిది కాదు. కానీ, ఈ మధ్య చాలామంది చెప్పులతో వెళ్ళడం చూసి విస్తుబోతుంటాను. అట్‌లీస్ట్ ఒక కవర్లో పెట్టుకొని చేతిలోనైనా పైకి తీసుకెళ్ళాలి కానీ చెప్పులతో మెట్లను తాకకూడదు.

విష్ణు నివాసంలోనే కౌంటర్ దగ్గర ఇస్తే మన బ్యాగుల్ని కొండమీదకు పంపిస్తారు కాబట్టి, కేవలం మనకు అవసరమైన వాటర్ బాటిల్, లైట్‌గా ఇంటిదగ్గర్నుండి తెచ్చుకున్న చపాతీ వగైరా ఫుడ్ సరంజామాతో పైకి నడిచివెళ్ళొచ్చు. నిజానికి ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటే చాలు. ఎందుకంటే నడిచివెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం గాలిగోపురం, అంజనాద్రి దాటి వెళ్ళిన తర్వాత నరసింహ స్వామి గుడి దగ్గరున్న ఒక ఊడలు దిగిన చెట్టు క్రింద భక్తులకు దేవస్థానమే టైమ్‌ను బట్టి టిఫిన్, భోజనం వగైరా ఏర్పాటు చేసింది కాబట్టి.

పైకి చేరుకున్న తర్వాత ఎప్పటిలానే మాధవ నిలయంలో లాకర్ తీసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పటికీ రూములు తీస్కోవడం నాకు ఇష్టముండదు. లాకర్లో జస్ట్ బ్యాగులు పడేస్తే చాలు, మిగతా అన్ని సౌకర్యాలకు ఏ లోటూ ఉండదు. నిద్రొస్తే ఆ సువిషాలమైన కొండమీద ఎక్కడైనా పడుకోవచ్చు. ఒక దుప్పటి తీస్కొని కోనేరు, ఆ చుట్టు పక్కల ఉన్న తిరుమాడ వీధుల్లో ఎక్కడైనా ఆ దేవుణ్ణి స్మరిస్తూ హాయిగా నిద్రపోవచ్చు.

తర్వాతి రోజు వరాహ స్వామి దర్శనం అయ్యాక ఎనిమిది గంటల ప్రాంతంలో నడిచివచ్చిన వారికోసం ఉన్న ప్రత్యేక క్యూలైన్లో నిలబడ్డాం. ఒక పక్క క్యూ కదులుతున్నా, మరో పక్క క్యూ లైన్లోకే టైమ్‌ను బట్టి పాలు, టిఫిన్, భోజనం సప్లై చేసింది దేవస్థానం. కాబట్టి వీటిని వేటి గురించీ ఆలోచించుకోకుండా దేవుణ్ణి స్మరించడమే మనం విధిగా చెయ్యవలసిన పని.  ఇప్పటికాలంలో క్యూలైన్లో కదులుతున్నప్పుడు గోవిందా..గోవింద అని అరవడం నామోషీ అయిపోయింది..ప్చ్.. ఎవరికి వారు మనసులో అనుకోవల్సిందే. మధ్యాహ్నం ఒంటిగంటకు దర్శనం అయిపోయింది. ఆ దివ్యమంగళ స్వరూపుడి గురించి కొత్తగా నేను చెప్పేదేమీ లేదు. ఎన్ని సెకన్ల టైమ్ దొరికితే అంత వ్యవధిలో ఆయన్ని తనివి తీరా చూడ్డమే చేయగలిగింది. ఇంకా బాగా నిధానంగా చూడాలనుకుంటే మాత్రం అమావాస్యరోజెళ్ళాలి. :-)

కొండమీద కొత్తగా కోనేటికి కొద్దిగా దగ్గర్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎవరో రాజు గారు అన్నదాన సత్రం భక్తుల సౌకర్యార్థం కట్టించారు. స్పేసియస్‌గా చాలా బాగుంది. మునుపటిలాగా పాత సత్రంలో ఇబ్బంది పడనఖ్ఖర్లేదు.

తిరుమలలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక మార్పు గానీ లేదా ఏదో ఒక కొత్త సౌకర్యం చేరడం గానీ జరుగుతుంటుంది. అందుకే ఏడాది క్రిందటితో పోలిస్తే, ఇప్పుడు కొత్తగా నా అనుభవంలోకి వచ్చిన కొన్ని మార్పులను, సౌకర్యాల గురించి ఇక్కడ రాశాను.