గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేశాను. కాబట్టి, సగం సినిమా గురించే ఇక్కడ మాట్లాడుకుందాము.
సినిమా స్టార్ట్ అవ్వడానికన్నా ముందు కొన్ని యాడ్స్ గురించి, హాల్లో జరిగిన ఇతర ముఖ్యమైన సంఘటనల గురించి లైట్‌గా చర్చించుకుందాం.
థియేటర్ బయట జనాలు ఎవ్వరూ లేక థియేటర్ ఓనర్ గాడు జుట్టు పీక్కుంటున్నాడు.
6:30PM కు షో అన్జెప్పి 6:45 PM కు మార్చాడు. తీరా 6:45 PM కు స్టార్ట్
చెయ్యలేదేమంటే, నేను షో స్టార్ట్ చేస్తానన్లేదు ఈ టైమ్‌కు
టికెట్లిస్తానన్నాడు.
టికెట్ ఎంత?
70, 100.
ఏంటీ ఏసీ కూడా లేని ఈ డొక్కు డకోటా థియేటర్లో టికెట్ ధర ఇంతనా? ఈ లెక్కన ఈ
ప్రపంచంలో టికెట్ ధరలు హైదరాబాదులోనే అత్యంత చీపు. హుమ్మ్, గత్యంతరం లేక
వంద టికెట్టొకటి తీస్కొని లోపలికెళ్ళా...
ఒక్కడిని థియేటర్ కెళ్ళడం నాకు చిరాకు. కానీ, వేరే ఆల్టర్‌నేటివ్ లేక మెల్లగా అటూ ఇటూ చూస్తూ ఫ్యాన్ ఉన్నదగ్గర కూచున్నా...
సినిమా ఎంతకీ స్టార్ట్ చెయ్యట్లేదు. ఏడు దాటి ఏడుంబావు అవుతోంది. ఏం చెయ్యాలో తోచక ఇలా బుక్కయ్యానేటీ అని నాకు ఏడుపొస్తోంది.
వెనకాల నుంచి ఎవడో గట్టిగా హాలంతా వినిపించేలా ఫోన్లో మాట్లాడుతున్నాడు.
ఇంట్రెస్టింగ్ అనిపించి చెవిని అటువైపు ట్యూన్ చేశా. నా మీద కేస్
పెట్టటానికి పోలీస్ స్టేషన్ కెళ్ళావటగా, కానిస్టేబుల్ ఇప్పుడే నాకు ఫోన్
చేసి చెప్పాడు, పెట్టుకో పెట్టుకో ఇప్పటికి మూడు సార్లు జైలుకెళ్ళొచ్చా,
జైలు నాకు కొత్తేం కాదు. నీయమ్మ! తల్చుకుంటే నిన్ను రేపటికల్లా మర్డర్
చేయించేయగల్ను అంటూ అవతలి వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈయన ఫోన్ కట్
చేస్తుంటే అవతలి వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. బెదిరించడానికో,
బ్రతిమాలడానికో అర్థం కావట్లేదు. కాసేపయ్యాక అర్థమయ్యింది, అవతలి వ్యక్తి
ఆడలేడీస్ అని. ఇద్దరిదీ ఏదో ఎఫైర్ వ్యవహారం అనీ, అది బెడిసికొట్టి
కేసులదాకా ఎళ్ళిందని. హుమ్మ్...మనకు సంబంధం లేని మ్యాటర్ అని చెవిని
థియేటర్ డీటీఎస్ సౌండ్‌కు ట్యూన్ చేశా.
వెంటనే స్టార్ట్ అయ్యింది. సినిమా కాదు. UFO Dts, వినండి, చెవులు
దొబ్బిచ్చుకోండి అని ఏదో క్యాప్షన్‌తో స్క్రీన్ మీద ప్రదర్శించబడింది.
సరే, అదైన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుందేమోననుకున్నా... ప్చ్.. అప్పటికే
లేటైనా కూడా థియేటర్లో జనాలు లేరనే ఏమో కంటిన్యూస్‍గా సమాజానికి ఉపయోగపడే
నాలుగు యాడ్స్ వేశాడు. ఇంక ఆలస్యం చేస్తే ఉన్న కాస్త జనాలు కూడా
వెళ్ళిపోతారనుకున్నాడో ఏమో సినిమా స్టార్ట్ చేశాడు.
సినిమా పేరు: గబ్బర్ సింగ్... కాదు కాదు "పవన్ కళ్యాణ్స్ గబ్బర్ సింగ్" అట.
ఏకే 47 ని పేలుస్తుండగా టైటిల్ పడుతూ ఉంది.
స్టార్టింగ్... షోలే సినిమాతో... ఎవడో పిల్లగాడు ముప్పై సార్లు షోలే
చూస్తున్నాడు. వాడు చూసింది చాలక తమ్ముడికి చూపిస్తున్నాడు. అదేదో స్వంత
థియేటరో లేక ఇళ్ళో అయినట్టు వాళ్ళబాబు వచ్చి అక్కడే పిల్లగాణ్ణి తిట్టి
లాక్కెళ్ళిపోతాడు. తీరా చూస్తే ఆడు వీడిబాబు కాదు, అన్నా, తమ్ముళ్ళిద్దరికీ
ఎవడి బాబు వాడికే సెపరేట్. పెద్దలంటే రెస్పెక్ట్ ఉండదు. ఆ బాబు మన పవన్
బాబుని నాలుగు చీవాట్లేయ్యగానే హీరోలాంటి విలన్ అవతారం ఎత్తేసి పారిపోయి
"గబ్బర్ సింగ్" గా ఎదుగుతాడు. మళ్ళీ పక్కూళ్ళోంచి పట్టుకొస్తారు అది వేరే
విషయం.
మనోడు ఏం చదువుకున్నాడో తెలీదు కానీ పోలీసాఫీసర్ అయిపోతాడు.
ఇంట్రడక్షన్ సీన్... టంటం టటటం...టాంటాంట టటటాయ్....
కొదమసింహంలో చిరంజీవిలా ఇంట్రడక్షన్. ఆ సినిమాలో అంత క్లాస్‌గా, స్టైల్‍గా ఉండదుకానీ ఏదో ఫర్లే...
అది పల్లెటూరో, టౌనో, తాలూకా స్థాయో, మండల స్థాయో నాకర్థం కాలేదుగానీ
అక్కడి వాతావరణం, మనుషులు చూస్తే పల్లెటూరు వాతావరణంలాగా ఉంటుంది.
పల్లెటూరులో పోలీస్ స్టేషన్, మళ్ళీ అందులో సీఐ ఏందబ్బా అని డౌటొస్తాది. ఆ
డౌట్ ఉండకూడదనే డైరెట్రు ఒక సెంటర్, ఆ సెంటర్లో చుట్టూరా చిన్న చిన్న
షాప్స్ పెట్టించాడు. ఆ సెంటర్ ఎందుకురా అంటే, ప్రతీ ఐదు పదినిమిషాల కోసారీ
హీరో, విలన్లూ ఫైటింగులు చేసుకోవడానికీ, మిగతా గ్యాప్‌లో హీరో, హీరోయిన్లూ
లవ్వాడేసుకోవడానికీ అన్నమాట.. విలన్లను కొట్టిన ప్రతీసారీ టాంటాంట టటటాం
అంటూ హోరోను స్లో మోషన్లో నడిపిస్తూ, వెనకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
మొత్తానికి అలా ఇంటర్వెల్ దాకా హీరో, విలన్ల కొట్లాట, మధ్యలో కొంచెం కామెడీ, కొంచెం లవ్వు ట్రాక్ తో నడిపించేశాడు.
అదేంటో, హీరో బాబు కాని ఒక బాబుకు రైస్ మిల్ ఉంటుంది. పాపం, ఆ మాత్రం ఆస్తి ఉన్నా కూడా ఇరవైఏళ్ళైనా కూడా అదే డొక్కు ఇళ్ళు ఏ మాత్రం మార్పులేకుండా ఉంటుంది. బహుశా సెంటిమెంట్ సీన్ల కోసమేనేమో... అట్టాగే తల్లి పాత్ర ఎక్కువసేపు అనవసరం అనుకున్నాడేమో ఉన్నట్టుండి సడెన్‌గా చంపేస్తాడు డైరెక్టర్.
ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జునా తదితర కీచు గొంతున్న హీరోలందరూ ఆవేశంగా బాలకృష్ణలా డైలాగులు చెప్పడం ఆపేస్తే మంచిది. ఎవడి మాడ్యులేషన్‍లో వాడు చెప్పుకుంటే బెటర్.
ఇక పవన్ కళ్యాణ్ గొంతు, మాటలు అర్థం కావాలంటే ఆయన సినిమాను నాలుగైదు సార్లు చూడాలి. హుమ్మ్..
థియేటరో లేక వేరే ఇంకేదన్నా కారణమో తెలీదు కానీ శృతిహాసన్ నాకు ఈ సిన్మాలో
నచ్చలేదు. "అనగనగా ఓ ధీరుడు" లో బాగా నచ్చింది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణ
అనుకుంటా...అందుకే అందంగా చూపించాడు అందులో...
ఇక సినిమాలో విలన్ ఏంటో, వాడి వాలకమేంటో ఓ పట్టాన అర్థం కాలేదు నాకు. సెకండాఫ్ చూస్తే అర్థమౌతుందేమో.
ఇదంతా ఎందుకుగానీ చివరిగా, ఆ సగం సినిమా నీకు నచ్చిందా అంటే నచ్చింది.
ఎందుకు నచ్చింది అంటే, నేను తెలుగు సినిమా ప్రేక్షకుణ్ణి. ఇట్టాంటి
సినిమాలు వాళ్ళు తీయడానికి, నేను చూడ్డానికి అలవాటు పడ్డాం కాబట్టి
నచ్చింది.
నచ్చితే సినిమా సగమే ఎందుకు చూశావ్ అనే కదా మీ డౌట్. హుమ్మ్... నాకు అంత టైమే దొరికింది మరి. లేటైతే ఎక్కడ బస్సు మిస్సౌద్దో అని బస్టాండ్‌కు పరిగెత్తి గంటన్నర పైగా కాలుగాలిన పిల్లిలా ఎదురు చూశాక బస్సొచ్చింది. ఏంటయ్యా, 8:45PM కు రావల్సిన బస్సు 10:30 PM కు ఇంత లేట్‌గా వచ్చిందేంటి? ఆన్‌లైన్‌లో టైమ్ తప్పు రాశారా అని అడిగితే, ఆన్‌లైన్ టైమ్ కరెక్టే బాబు, కానీ ఆఫ్‌లైన్‌లోబస్సు ఆ టైమ్‌కు రాదు. అసలు 6:45 PM కు Origin లో స్టార్ట్ అవ్వాల్సిన బస్సు స్టార్ట్ అయ్యిందే 8:45 PM కు అని చావు కబురు చల్లగా చెప్పాడు. :-(
